ఖర్కోటఖుడు – Part 3
హర్ధిక్ కారు లంబసింగి వైపు దూసుకుపోతుంది. మరో వైపు… రాత్రి 9.30.. కాలిఫోర్నియాలో విలాసవంతమైన కోట అది.. అది రిచర్డ్స్ కొత్తగా 200 కోట్లు పెట్టి కొన్నాడు. ఊరికి దూరంగా విసిరేసినట్టు ఉంది అది. చుట్టూ భయంకరమైన చీకటి. మధ్యలో ఆ కోట దేదీప్యమానంగా నియాన్ లైట్ల కాంతిలో మెరిసిపోతుంది. చుట్టూ కట్టుదిట్టమైన భద్రతా సిబ్బంది. అక్కడికి రిచర్డ్స్ తప్ప వేరే ఎవరూ రారు. కోటలోకి రోల్స్ రాయిస్ ఘోస్ట్ వచ్చి ఆగింది. కార్ లోంచి దిగిన రిచర్డ్స్ వడివడిగా అడుగులు వేసుకుంటూ లోపలికి వెళ్లిపోయాడు. రిచర్డ్స్ ఒక పేరు మోసిన బిజినెస్ టైకూన్. అతనికి సైన్స్ అన్నా వాటి మీద రీసెర్చ్ అన్నా చెవి కోసుకుంటాడు. అతను కోటలోకి వచ్చి అతని మాస్టర్ బెడ్ రూం తాళం తీసి లోపలికి వెళ్లిపోయాడు. లోపలికి రాగానే డోర్ క్లోజ్ చేసి షెల్ఫ్ దగ్గర ఉన్న బుక్స్ దగ్గరికి వెళ్లిపోయాడు. అందులో నుండి కొన్ని పుస్తకాలు కింద పెట్టి షెల్ఫ్ మీద చెయ్యి పెట్టాడు. అతని హ్యాండ్ ప్రింట్ చెక్ చేసిన సిస్టం గోడ వెనక ఉన్న రహస్య ద్వారాన్ని తెరిచింది. అక్కడ పాస్వర్డ్ టైపు చేసి అతని కంటి రెటీనాని ఇచ్చి లోపలికి వెళ్లాడు. లోపలికి అడుగు పెడుతోంటే అది ఇంతకు ముందు చూడని కొత్త లోకంలా ఉంది. అక్కడ మొత్తం ఎలక్ట్రానిక్ పరికరాలు, రకరకాల ప్రయోగాలుతో అదంతా ఒక పెద్ద ల్యాబ్ లా ఉంది. నిజమే అది ల్యాబ్.. రిచర్డ్స్ ప్రైవేట్ ల్యాబ్.. మొదటి నుంచి రిచర్డ్స్ కి టైం ట్రావెల్ అంటే విపరీతమైన ఆసక్తి. అక్కడ ల్యాబ్ లో డాక్టర్ మల్హోత్రా అటూ ఇటూ తిరుగుతున్నాడు. అతనే ఈ ల్యాబ్ కి చీఫ్. అతని ఆధ్వర్యంలోనే టైం ట్రావెల్ కి సంబందించిన ప్రాజెక్ట్ 7 సంవత్సరాల నుంచి సాగుతుంది. దానికి సంబంధించిన పనుల్లో బిజీగా వున్నాడు మల్హోత్రా.. “ఎనీ ప్రోగ్రెస్ మల్హోత్రా?” కూల్ గా అడిగాడు రిచర్డ్స్. “ఆల్మోస్ట్ డన్ సర్.. ఉయ్ ఆర్ జస్ట్ ఫ్యూ స్టెప్స్ అవే” “ఎవరి ఊహకి అందనంత జీతాలు ఇస్తున్నాను. నేను అనుకున్న పని జరగకపోతే మాత్రం నేను చంపడానికి కూడా ఆలోచించను” కటువుగా పలికింది రిచర్డ్స్ గొంతు. ఆతని మాటలు వింటూనే మళ్ళీ తన పనిలో పడ్డాడు మల్హోత్రా.. రిచర్డ్స్ అక్కడి నుండి బయలుదేరి వెళ్లిపోయాడు. ఇది జరిగే సమయానికి ఇక్కడ హర్ధిక్ లంబసింగి చేరిపోయాడు. అది ఒక చిన్న గూడెం. ఎక్కడ చూసినా అడివి బిడ్డలే. హర్ధిక్ కార్ తీసుకుని ఒక హోటల్ లాంటి చోట ఆపాడు. ఆ హోటల్ పాపన్న దొరది. లోపల కొంత మంది ఆడవాళ్లు తమ పనుల్లో నిమగ్నం అయ్యి ఉన్నారు. బయట నిలబడి పిలిచాడు. “వస్తున్నా..” కోయిల గొంతుతో ఉన్న 30ఏళ్ల హంస చీర కట్టుకుని వచ్చింది.