మనసున మనసై (సీరియల్ 1వ భాగం)
మనసున మనసై..! అందరికీ హాయ్.. ఇప్పటిదాకా నేను రాసిన కథలు చదివిన మీరు నాకు మంచి సపోర్ట్ ఇచ్చారు. ఇప్పు నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకొని, కొన్ని ఫాంటసీలను జోడిస్తూ… రాస్తున్న సీరియల్ ‘‘మనసున మనసై’’. దీనిని కూడా ఇంతకు ముందు రాసిన కథల్లాగే మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. :: 1వ అధ్యాయం :: మా నాన్నగారికి ట్రాన్స్ఫర్ అవ్వటం వల్ల కర్నూలు నుంచి విజయవాడకి షిఫ్ట్ అయ్యాం.. 2010 దసరా ఉత్సవాలు కావటంతో నగరమంతా కూడా చాలా అందంగా ముస్తాబై వుంది.. ఎక్కడ చూసినా జనం.. రద్దీతో నిండిపోయాయి విజయవాడ రహదారులు.. అదే సమయంలో నేను మా, అమ్మా నాన్నలతో అడుగు పెట్టాను.. ఊరిలోకి వెళుతుండగానే దూరంగా కొండమీద నుంచి దుర్గమ్మ గుడి కనిపించింది, కొంచెం ముందుకెళ్ళగానే కృష్ణమ్మ తన మీదుగా వెళ్ళమంటూ మమ్మల్ని ఆహ్వానించినట్లు అనిపించింది. అప్పటిదాకా నాకు తెలీదు.. నాకోసం పుట్టిన అమ్మాయి నా బంగారు కొండ బెజవాడలో భద్రంగా ఎదురు చూస్తోందని.. నాన్నగారు అప్పటికే మా కోసం మేముంటానికి వీలుగా లబ్బీపేటలో ఇల్లు ఒకటి చూసేశారు. మా లగేజీ లారీ కరెక్ట్ గా వెళ్ళి మా ఇంటి ముందు ఆగింది. ఆ రోజు దుర్గాష్టమి. ఇంటిలో చేరాం… పాలు పొంగించాం… మరుసటిరోజు మహర్నవమి ఇల్లంతా సర్దేసుకొని బాగా అలసిపోవటంతో మేం గుడికి వెల్దామనుకున్నా కూడా వెళ్ళలేక పోయాం.. తర్వాత రోజు విజయదశమి.. బెజవాడంతా పండగ వాతావరణం నెలకొంది. ఆరోజు అమ్మవారికి చాలా ఇష్టమైన రోజట.. అందుకే నన్ను తీసుకొని మా అమ్మ,నాన్న అమ్మవారి కొండకు బయల్దేరారు.. నాకు పూజలు, గుడులూ పెద్ద ఇంట్రస్ట్ లేదు.. నేను రాను అంటున్నా మా నాన్న నన్ను పిర్రలమీద రెండు పీకి గుడికి తీసుకెళ్ళాడు.. నదిలో స్నానం చెయ్యమన్నారు. నేను చెయ్యను అన్నాను. మళ్ళీ నాన్న తిట్ల దండకం మొదలు పెట్టాడు. అమ్మ నాన్నతో గొడవ పడుతోంది. నాన్న నన్ను తిట్టటం ఆగలేదు.. అమ్మ నాన్నతో గొడవ పడటం ఆగలేదు.. జనం ఎవరి గొడవలో వాళ్ళున్నారు.. ఇదే టైంలో నా కళ్ళు నదిలో నుంచి పైకి లేస్తున్న ఒక పువ్వు మీద పడ్డాయి. ఆ పువ్వు ఎలా వుందంటే.. కలల కొలనులోంచి కవ్విస్తున్నట్లుగా బయటికొచ్చిన తామరపుష్పంలా, అప్పుడే మబ్బుల మాటు నుండి బయటికి వస్తున్న చందమామలా.. కృష్ణమ్మ నదీ జలాలను పక్కకి తోసుకుంటూ పైకి లేచింది నా సుకుమారమైన కుసుమ కోమల లావణ్యమైన బుజ్జి…. అప్పటికి నాకు తనపేరు తెలీదు.. అందుకే బుజ్జి అని ముద్దుగా పిలుచుకున్నా…తనని చూడగానే ఏదో ఆనందం నాలో ఎప్పుడు లేని ఒక ఉత్సాహం తన ముఖం మీద లేలేత సూర్యుని కిరణాలు పడుతుంటే నాకంటే ముందు నా బుజ్జి నీ తాకుతావ అని సూర్యుడి మీదే కోపం వచ్చింది…. ఆ టైంలో నదిలో ఎవ్వరూ లేరు.. నా బుజ్జి మాత్రమే వుంది..