శనివారం సాయంత్రం!
శనివారం సాయంత్రం. అది బాంబే నగర సరిహద్దుల్లో లో ఒక లక్జరీ అపార్ట్మెంట్. బాత్ రూం లో టబ్బు అంచు మీద ఆనుకుని చేతి లో ప్రేగ్నన్సి కిట్ వైపు చూస్తూ ఆలోచిస్తున్నాను. ఈ సారి కూడా ఫెయిల్ అవటం ఖాయం అనిపిస్తోంది. మనస్సు పరి పరి విధాలు గా పోతోంది. కాసేపటికి స్టిక్ రంగు మారింది. ఏ మూలో వున్న ఆ కాస్త ఆశ కూడా పోయింది. ఒక నిట్టూర్పు విడిచి లేచాను. బయటికి వొచ్చేసరికి, శరత్ నా వైపు ప్రశ్నార్ధకం గా కనుబొమ్మలు ముడిచి చూస్తూ కనిపించాడు. నేను ఆయన కేసి చూసి తల అడ్డం గా వూపాను.”అర్ యు షూర్” ? శరత్ నా చేతి లోంచి స్టిక్ తీసుకుని మళ్ళీ చూసాడు, నమ్మలేనట్టుగా. “నీకు తెలుసు, నాకు ఇదేమి కొత్త కాదు. చాలా సార్లే చేశాను ఇప్పటి వరకు” అన్నాను, కొంచెం విసుగ్గా.”మన ప్రయత్నం మనం చేస్తూ వుండాల్సిందే, తప్పదు” శరత్ స్టిక్ ని ట్రాష్ లో పడేసాడు.”మనం టెస్ట్ చేయించుకుంటే బావుంటుందేమో..” నా మాట పూర్తి కాకుండా నే, “నో!!” అంటూ అతని గొంతు ఖంగు మంది. నేను ఎటో చూస్తునాను. మా ఇద్దరి మధ్య కాసేపు నిశ్శబ్దం ఇబ్బంది గా అనిపించింది. కాసేపటికి అతనే నన్ను దగ్గరికి తీసుకుని “ప్రియా, మనం కొంచం ఓపిక పట్టాలి, అంతే, డాక్టర్లు మాట విని మనం ఇంకా ఖంగారు పడాల్సిన అవసరం లేదు.” అంటూ బుజ్జగించే ప్రయత్నం చేసాడు. “ఆ దేవుడే మనం రెడీ అనుకున్నప్పుడు తప్పకుండా కడుపు పండిస్తాడు”. ఈ నమ్మకాలంటేనే నాకు చెత్త చిరాకు. నేనేదో అనే లోపల ఫోన్ మోగింది. కాలిఫోర్నియా నించి మా ఆయన అక్కయ్య. ఆవిడ తో మాట్లాడి మేమిద్దరం ఇక డిన్నర్ ప్రయత్నం లో పడ్డాం. సోమ వారం మధ్యాహ్నం. లంచ్ బాక్స్ తీసుకుని ఆఫీసు బ్రేక్ రూం లో ప్రతి రోజు కూర్చునే టేబుల్ దగ్గర అన్నం కెలుకుతూ కూర్చున్నాను. తినే మూడ్ లేదు. ప్రతి రోజూ లాగానే, నీలూ నాతో కూర్చుంది. తను నా క్లోజ్ ఫ్రెండ్. బిజినెస్ స్కూల్ లో మేమిద్దరం చదివే రోజుల నించి మా మధ్య చాల మంచి దోస్తీ. ఏడేళ్ళ నించి బాంబే లో ఒకే కంపెనీ లో ఒకే ఫీల్డ్ లో వున్నాం. నేను సేల్స్ లో వుంటే, తను హుమన్ రిసోర్సెస్ లో పని చేస్తుంది. మా ఇద్దరి సీట్లు వేరే వేరే చోట ఐనా, తప్పనిసరి గా లంచ్ టైం లో కలిసి మాట్లాడుకోవటం అలవాటు. “ఏంటే, నీ మొహం చూస్తుంటేనే తెలుస్తోంది” అంది అది. మా మధ్య దాపరికాలేవీ లేవు. “అవును” అన్నాను ముక్తసరిగా. “మరి శరత్ టెస్ట్ చేయించుకోటానికి ఒప్పుకున్నాడా?” “నో. ప్రతి సారీ, అదే వితండ వాదం. దేవుడి దయ వుండాలి, అంటూ. ఇప్పటికి మేము ప్రయత్నం చెయ్యటం మొదలెట్టి రెండేళ్లు ఐంది తెలుసా? ఇంకా ఎవరినా అయితే డాక్టర్లని కలుస్తారు. మా ఆయన మాత్రం గుళ్ళూ గోపురాలు తిరిగే రకం.